'ది లయన్ కింగ్' ఫ్రాంచైజ్ కి ఇండియాలోనూ ఎందరో అభిమానులున్నారు. ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ నుంచి 'ముఫాసా: ది లయన్ కింగ్' వస్తోంది. ఈ మూవీ యొక్క హిందీ వెర్షన్ కోసం బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ఫ్యామిలీ రంగంలోకి దిగింది. షారూఖ్ ఖాన్ మరియు ఆయన కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ ఖాన్ ఈ చిత్రానికి వాయిస్ అందిస్తున్నారు.
బారీ జెంకిన్స్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'ముఫాసా: ది లయన్ కింగ్' మూవీ, ఇండియాలో ఈ ఏడాది డిసెంబర్ 20న ఇంగ్లీష్, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది. తాజాగా హిందీ వెర్షన్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఆకట్టుకునే కథాకథనాలు, అదిరిపోయే విజువల్స్ తో ట్రైలర్ మెప్పించింది. ముఫాసాగా షారుఖ్, సింబాగా ఆర్యన్, యంగ్ ముఫాసాగా అబ్రామ్ వాయిస్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
'ముఫాసా : ది లయన్ కింగ్'తో అసోసియేషన్ గురించి షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ 'ముఫాసాకు అద్భుతమైన వారసత్వం మరియు స్టాండ్ ఉంది. అడవికి అంతిమ రాజుగా, తన జ్ఞానాన్ని తన కొడుకు సింబాకు అందించాడు. నేను అతనితో లోతుగా సంబంధం కలిగి ఉన్నాను. 'ముఫాసా : ది లయన్ కింగ్'.. ముఫాసా జీవితాన్ని బాల్యం నుండి నమ్మశక్యం కాని రాజుగా ఎదగడం వరకు వర్ణిస్తుంది. డిస్నీతో కలిసి పని చేయడం, ముఖ్యంగానా కొడుకులు ఆర్యన్ మరియు అబ్రామ్, ఈ ప్రయాణంలో భాగం కావడం సంతోషాన్ని ఇచ్చింది' అని తెలిపారు.
ముఫాసా మరియు సింబాగా తాము షారూఖ్ ఖాన్ మరియు ఆర్యన్ ఖాన్ తప్ప మరెవరినీ ఊహించలేమని డిస్నీ తెలిపింది. వారికి అబ్రామ్ కూడా తోడవ్వడం, మరింత ప్రత్యేకంగా మారిందని పేర్కొంది. ఈ అద్భుతమైన కథను మిలియన్ల మంది భారతీయ ప్రేక్షకులు వారి కుటుంబాలతో ఆస్వాదించేలా చేయడమే తమ ముఖ్య ఉద్దేశమని డస్నీ స్టార్ స్టుడియోస్ అధిపతి బిక్రమ్ దుగ్గల్ అన్నారు.